Thursday, 19 April 2018

If you love them...

చాలా చిన్నప్పుడు వేసవి శేలవులకి మా నానమ్మ (తాళ్ళూరు) వాళ్ళ ఉరు వెళ్లి నపుడు మా పెద్దమ్మ ఒకావిడ ఉండేవారు. మా పెదనాన్న నాగయ్య గారి భార్య. మేము వస్తున్నాం అని ఎలా తెలుసుకునేదో కాని వెళ్ళినప్పుడల్లా పెద్ద గిన్నె మీద బోర్లించిన జల్లి బుట్ట తీసి దానికింద నుండి పాల అరిసెలు తీసి ఇచ్చేది. అద్బుతం గా ఉండేవి. పిల్లలం అందరికి తలా రెండు ఇచ్చేది కాని నన్ను ప్రత్యేకం గా చూసేది అనిపించేది. “పెద్దమ్మా పాల బూరెలు బాగున్నాయి. బస్సు ఎక్కినప్పటి నుండి పాలబూరెలు గుర్తు కోస్తున్నాయి” అనే వాడిని లొట్ట లేస్తూ ...
**
చిన్నప్పుడు మా అమ్మ పాలు పోసి పొట్లకాయ కూర వండేది. రుచిగా ఉండేది. అమ్మా బలే ఉంది అంటూ “కుమ్ముకునే” వాడిని.
ఇంకొంచెం వేసుకో అని గిన్నె లో కూర వేసేది. నాన్న ‘నీకు ఉంచుకో’ అంటే వేరే గిన్నెలో ఉంది అనేది. ఆ వేరే గిన్నె ఎప్పటికి ఉండదని తండ్రి ని అయ్యాక కాని తెలియలేదు.
**
నా కంటే వయసులో మూడు ఏండ్లు పెద్దదయిన ఒక టీచర్ ని కలిసి మా నాన్న గారి స్కూల్ తాళాలు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు మంచం లో ఉన్న ఆమె తల్లి శ్వాస తీసుకోటానికి ఇబ్బంది పడుతూ ఉంది. ఇద్దరం కలిసి నులక మంచం మీద ఆవిడని మోసుకుంటూ అర కిలోమీటరు దూరం లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళాం. ఆ సంఘటన ప్రభావం ఆమె మీద చాలా ఉండేది.
**
పెళ్ళయిన తోలి రోజుల్లో మా ఆవిడకి మూడు గ్రాముల బంగారం తో చెవులకి వేలాడే ముత్యాల ఆభరణాలు కొని ఇచ్చాను “ఇవి నీకు నప్పుతాయి. తల ఉపేటప్పుడు ఇవి కుడా కదులుతుంటాయి. నాకు చూస్తూ ఉండాలనిపిస్తుంది” అని చెప్పాను. ఇప్పటికి ఆభరణాలు అనేకం మార్చినా వాటి జోలికి పోదు. అపురూపం గా అలంకరించుకుంటుంది.
**
నా ఫ్రెండ్ (బ్యాంకు ఉద్యోగి) ఇంటికి వెళ్ళినప్పుడు అయన కుమార్డు (GMC లో MBBS ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు) ఇంట్లోకి వెళ్లి గ్లాసు తో కుండ నీళ్ళు తెచ్చి ఇచ్చి “బాగున్నారా అంకుల్” అంటాడు.
**
నా టీం మెంబర్ నా శిష్యుడు.. పల్లెలు తిరిగి మద్యానం ఆఫీస్ కి వచ్చేముందు “లంచ్ తెచ్చుకున్నారా? పార్సిల్ తేనా?” అని అడుగుతాడు. పోయిన నెలలో సర్జరీ చేయించుకున్న అమ్మ కి ఎలా ఉంది అని అడిగితె.. గుండె లోపలి నుండి నవ్వుతాడు.
**
రిలేషన్స్ ని కాపాడుకోటాని పెద్దగా ఖర్చేమి కాదు. ముసుగులు తొలగించి మనసుతో మాట్లాడు కుంటే చాలు, ఒక నవ్వు చాలు.. ఒక పువ్వు చాలు.
**
ఒక ఇరవై ఏళ్ల క్రితం అనుకుంటాను. దూరదర్శన్ లో ఒక ప్రకటన వచ్చేది. ఒక ఆరేడు వయసున్న పిల్లాడు ఒక ఇంటి కాలింగ్ బెల్ ఎగిరి మరీ మోగిస్తాడు. ఒక ముసలావిడ తలుపు తీస్తుంది. ఆ పిల్లాడిని కోపంగా చూస్తుంది. వాడు వెనక్కి దాచిన చేతుల్లో ఒక పూల గుత్తి ఉంటుంది. “హాపీ బర్త్ డే దీదీ” అంటాడు ఆ పెద్దావిడ బుగ్గలు చొట్టలు పడేలా నవ్వి చేతులు చాస్తుంది. If you love them. Express it. అని ఒక ఇంగ్లిష్ కాప్షన్ మెరిసేది.
**
కొన్ని భావాలని మనసులో బంధిస్తే కుదరదు. మాటల్లోకి మార్చాల్సిందే.
మనసు  ని
సజీవంగా ఉంచుకోవాల్సిందే. <౩ <౩ <౩

Monday, 16 April 2018

నాన్నొచ్చాడు.


అజ్ఞాతం లో ఉంటున్న నాన్న అమీర్పేట హాస్టల్ కి వచ్చాడు.
ఆర్నెల్లు దాటింది నాన్నని చూసి. తెల్లగడ్డం చింపిరిగా ఉంది. చర్మానికి ఏదో అయ్యింది. కళ్ల చుట్టూ నల్లగా ఉంది. 
నుదురు మీద పగుళ్లు కనిపిస్తున్నాయి. నోట్లో నుండి గుట్కా వాసన వస్తుంది. ఎప్పటిలాగా లెనిన్ ఫాంటు, బ్రాండెడ్ చొక్కాలో లేదు. ఫ్లాట్ ఫార్మ్ మీద అమ్మే లాటి బట్టలు వేసుకుని ఉన్నాడు.
బాంకు లో పని ముగించుకుని హాస్టల్ కి వస్తుంటే కింద పార్కింగ్ లో ఎదురుచూస్తున్నాడు.
“నాన్నా..” గుర్తు పట్టాక ఆమె పిలిచింది. కష్టం గా నవ్వాడు.
ఆమె కళ్ళు మసక బారాయి. “ఏమన్నా తింటావా?”.
వద్దన్నాడు కానీ ఆ సైగలో చాలా ఆకలి ఉంది.
రోడ్డు మీద అమ్మే ఇడ్లీ నాలుగు తిని నీళ్ళు తాగాక తెప్పరిల్లాడు.
“డబ్బు కావాలి.. “ అన్నాడు.
ఊరినిండా చేసిన అప్పులు పెరిగి మురిగి మాయామయిన నాన్న ఆచూకీ తెలీదని లోకాన్ని నమ్మించలేక రెండునెలలక్రితం ఆసిడ్ తాగి గొంతు కోల్పోయిన అమ్మ గురించి గాని, కృష్ణానగర్ లో ఏంచేస్తుందో ఎలా బతుకుతుందో తనకే స్పష్టత లేని అక్క గురించి కానీ అడుగుతాడేమో అని ఆశపడింది.
“నా జీతం పదిహేడు వేలు చేసేది ప్రైవేట్ బ్యాంక్ లో. ఉంటానికి తింటానికి ఆరున్నర వేలు, సిటీ బస్సులకి, మిగిలిన ఖర్చులకి రెండు మూడు వేలు. నెలనెలా అమ్మకి పంపేది అయిదు వేలు నావద్ద పది పన్నెండు వేలు మించి ఉండవు నాన్నా..”
“నాకు అయిదు లక్షలు కావాలి. “
“అయిదు లక్షలా? “ నోరు పెద్దది చేసింది.
“నేను మీ బ్యాంక్ లో మాట్లాడతాను. రేపు ఉదయం మీ బ్యాంక్ కి వస్తాను.” వెళ్ళేటప్పుడు పర్సులో ఉన్న రెండు వందలు తీసుకుని వెళ్తున్న నాన్నని 'ఎలా వున్నావు?' అని అడుగుతాడేమోనని కనిపించే వరకు చూసింది ఆమె.
**
నెలకి అయిదువేలు కటింగ్. మిగిలిన పన్నెండు వేలు నెల జీతం అయిదు లక్షల అప్పు తీరెంతవరకు పెరగదు. ఉద్యోగం మానటం కుదరదు. కండిషన్స్ మీద ఆమె ఎన్నాళ్ళకి బాకీ తీరుతుందో లెక్కలు వేసుకుంటూనే ఉంది.
నెక్స్ట్ వీక్ హాస్టల్ మారాబోతుంది ఆమె. వేరే చవక హాస్టల్ కి. నెలకి ఆరున్నరవెయ్యి అంటే కష్టం.

Sunday, 1 April 2018

నాన్నా తప్పు చేశాను

ఒక పలచటి చక్క మీద మూడు సన్నని సీలలు త్రిబుజాకారం లో దిగ్గోట్టి,, రెండిటికి సిల్క్ వైరు ముక్కలు కలిపి టార్చి లైట్ లో త్రెడ్స్ ఉన్న బల్బు తీసుకుని రెండు సీలల మద్య తిప్పి హోల్డర్ లాగా చేయటం, సైకిల్ ట్యూబ్ లోకి బెటరీలు ఎక్కించి వాటిని కూడా రెండు రెండు అంగుళాల సీలల మద్య జాగర్తగా కూర్చో పెట్టి రెండువైపులా చీలలకి సిల్క్ వైరు చుట్టి వాటిని బెండ కాయ స్విచ్ లకి బిగించి లైట్ ఆన్/ఆఫ్ చేయటం నాకు ఎల్వా ఎడిసన్ కన్నా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది.
అప్పట్లో నా జర్మన్ సిల్వర్ స్కూల్ బాక్స్ లో అనేక పరిశోదనల కి కావల్సిన ముడి పదార్ధాలు ఉండేవి. బహుశా ఏడో తరగతి అనుకుంటాను. మద్దిపాడు కడియాల యానాదయ్య గవర్నమెంటు జూనియర్ కాలేజీ (అప్పటికి హై స్కూల్ మాత్రమే) లో చదువుతుండే వాడిని. వరసగా కామన్ వరండా ఉండే జాయింట్ పెంకుటింట్లో ఒక పోర్షన్ లో ఉండేవాళ్లం. పక్క పోర్షన్ లో సుధాకర్ అని ఒక కార్పెటర్ కుర్రాడు ఉండేవాడు. వాళ్ళ స్వంత ఇల్లు అది. అతని వద్ద నేర్చుకున్నాను ఈ విద్య.
ఎక్కడి ఎక్కడి నుందో వైరు ముక్కలు, సన్నటి బల్బులు, పారవేసిన బాటరీలు (ఎండలో ఉంచి సీరీస్ లో కలిపేవాడిని) బెండ కాయ స్విచ్ లు, ప్లగ్ లు లాటి నానా చెత్త నా ప్రయోగశాలలో ఉండేవి. స్కూల్ వదిలాక ఇదే పని. రక రకాలుగా ప్రయత్నాలు చెయ్యటం. స్విచ్ వేస్తే కొన్ని ఆపితే కొన్ని వెలిగేలా చెయ్యటం.. ప్రయోగ ఫలితాలు గ్రంధస్థం  చెయ్యటం బలే సరదాగా ఉండేది.
***
ఒక రోజు, ఆరు బయట నులక మంచం మీద బొంత వేసుకుని, నిండా దుప్పటి కప్పుకుని నిద్ర మొదలెట్టపోతున్నాను..
పొట్టి ఆంజనేయులు వచ్చాడు. వచ్చీ రావటం తోటే
"పంతులూ బయటకి రా “ అన్నాడు మా నాన్న ని.
అతని మొరటు పిలుపుకి నా పై ప్రాణాలు పైనే పోయాయి.
మా నాన్న ఇంట్లో నుండి కంగారుగా బయటకి వచ్చాడు.
పొట్టి ఆంజనేయులు లుంగీ మడిచి నిలబడ్డ విదానం, అమర్యాదగా మాట్లాడే విధానం దుప్పటి నుండి చూస్తున్న నాకు వణుకు పుట్టిస్తుంది.
“మా కొత్త ఇంట్లో కరెంటు బిగిస్తున్నారు. పంచలో బొర్ల్ద్ మీద బిగించిన జెరో బల్బు కలర్ ది మీ కొడుకు తెచ్చాడు. అది పట్టుకు రా” అన్నాడు. నాకు నిక్కర్ తడిచి పోయింది.
మా నాన్న అసలే పిరికి వాడు. “ఏం బల్బు? మావాడు తేవటం ఏమిటి?” అన్నాడు కంగారుగా.
ఈ రోజంతా మీ వాడు మా ఇంటి వద్దనే తఛట్లాడాడంట. కొత్త బల్బులు బిగిస్తుంటే “ఇవి బాటరీలకి వెలుగుతాయా?” అని పనోళ్లని అడిగాడంట. వెలగవు అని చెబితే ‘ఎందుకు వెలగవు’ అని అడిగాడంట. వాళ్ళు వెళ్ళి పోయాక ఇప్పుడు చూస్తే పంచలో కలర్ బల్బు లేదు. మీ వాడే తీసి ఉంటాడు.”
నా మీద అదేదో పిడుగు ఉంటుందటగా అది పడితే బాగుండు అనిపించింది.
కానీ అలాటిది ఏమి జరగలేదు.
ఇలాటి క్లిష్ట పరిస్థితిని హాండిల్ చెయ్యటం మా అమ్మ కే సాధ్యం.
“ఆంజనేయులు అన్నా .. పిల్లాడు నిద్ర పోయాడు. మా పిల్లాడు అలాటి వాడు కాదు. ఒకవేళ అలా చేసినా అబద్దం చెప్పే అలవాటు లేదు. ఉదయం వాడు లేవగానే అడిగి విషయం చెబుతాం. మీరు వెళ్ళండి” అంది.
“విషయం చెప్పేది ఏమి లేదు. రేపు బల్బు ఇవ్వాల్సిందే. మీవాడు దొంగతనం చెయ్యటం చూసిన వాళ్ళు ఉన్నారు.”
“దొంగతనం” అన్న మాట నా గురించి మా నాన్న విన్నందుకు అక్కడి కక్కడే ప్రాణం పోవాల్సింది. దేవుడు మనం అడిగినది ఏదీ ఇవ్వడు.
పొట్టి ఆంజనేయులు ని పంపించాక మా అమ్మా నాన్నా ఇంట్లోకి వెళ్లారు.
ఆ రాత్రి నా పుస్తకాల బాక్స్ లో నా పరిశోదనా సామాగ్రి అంతా వెతికి ఉంటారు. చెవులు రిక్కించి వింటూ ఉండిపోయాను.
నేను కోరుకున్నట్లు నాకు మరణము రాలేదు.
మా అమ్మా నాన్నకి ఆ బల్బు దొరకనూ లేదు...
ఆ రాత్రి ఎప్పుడు నిద్ర పోయానో తెలీదు.
ఉదయం నిద్ర లేచిన కొద్ది సేపటికి రాత్రి గుర్తొచ్చింది.
అమ్మా నాన్న నన్నేమి అడగలేదు. నాన్న ముఖం అవమాన భారం తో ఉంది.
అమ్మ ముభావం గా ఉంది.
..
అగ్ని పర్వతం పేలితే బావుండేది. పేల లేదు.
నన్ను ఎగరేసి తంతే బావుండేది.
మూల న ఉన్న పొట్టు బస్తా మీద వేసి, జొన్న దంట్లు తీసుకుని వీపు చీలిందాకా కొడితే బావుండేది
ఊహూ. అలా జరగలేదు.
వాళ్ళిదరి నిర్లిప్తత నన్ను కాల్చేస్తుంది.
బొగ్గుల కుంపటి లో ఎర్రగా ఉన్న నిప్పులు మింగేద్దామని పించిది.
హోమ్ వర్కు లు చేసుకున్నాను. చిన్న ఇత్తడి చెంబు లో నీళ్ళు తీసుకుని ఊరి చివరికి వెళ్ళి వచ్చాను. బోరింగ్ వద్ద నీళ్ళ బకెట్ నింపుకుని స్నానం చేశాను.
స్కూల్ కి రెడీ అయ్యాను. అమ్మ ఏమి పెట్టిందో కానీ తినేశాను. లేచి కూర్చున్న పీట గోడ వారగా పెట్టాను. అద్దం లో చూస్తూ తల దువ్వు కున్నాను.
..
సంచి తగిలించుకుని స్కూల్ కి వెళ్తుంటే అమ్మ “ఒరేయ్ వాసు “ అంది.
అప్పుడయినా తంతుందేమో అని ఆశగా వెనక్కి తిరిగాను.
నాన్న వద్దన్నట్లు అమ్మతో కళ్ల సైగ చేశాడు.
ఆమె మౌనం గా ఉండి పోయింది. నేను హవాయి చెప్పులు వేసుకుని బయలు దేరాను.
మధ్యానం స్కూల్ లో తెచ్చుకున్న కారేజి తినేశాను.
హెచ్చెమ్ గారి రూము ముందు ఉండే కుండలో చల్లటి నీళ్ళ కోసం గొడవ పడలేదు.
రెండు గిన్నెల్లో ఒక గిన్నె లో అన్నం మిగిలి పోయింది.
గ్రౌండ్ లోకి వెళ్ళి కుక్క పిల్లలకి ఒక కాగితం వేసి గిన్నె బోర్లించి వచ్చేశాను.
..
తెలుగు ఆయవార్లు ఏదో పాఠం చెప్పాడు.
మద్యలో లేపి చెయ్యి చాచమని బెత్తం తో కొట్టాడు.
ఎప్పటి లాగా చెయ్యి వెనక్కి లాక్కొలేదు.
చేతి మీద బెత్తెమ్ పొంగి పోయింది.
ఆయన దగ్గరకి తీసుకున్నాడు. “ఏమయింది రా” అన్నాడు పొదువుకుని.
“నేను చచ్చి పోతా సార్. మళ్ళీ కొట్టండి” అన్నాను ఏడుస్తూ..
ఆ ఏడుపు దెబ్బతాలూకు కాదని నాకు మాత్రమే తెలుసు.
కాలం ఆగదు. సాయంత్రం అయింది.
గ్రౌండ్ లో చాలా సేపు ఒంటరిగా కూర్చున్నాను.
చీకటి పడుతుండగా ఇంటికి వచ్చాను. నేను వచ్చిన కాసేపటికి నాన్న వచ్చారు.
నాకోసం స్కూల్ మొత్తం జల్లెడ పట్టి ఉంటాడు.
ఇంట్లో మరో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. ..
మా అమ్మ వద్ద జాకెట్లు కుట్టించు కోటానికి వచ్చేవాళ్లు.
“ఎసమ్మ దగ్గరకి వెళ్దాం. పిల్లాడికి అపనింద ఎందుకు వచ్చిందో కరెక్ట్ గా చెప్పుద్ది”
అమ్మ చెప్పినట్లు స్నానం చేశాను.
ఒక చిన్న సీసాలో లో కొబ్బరి నూనె తీసుకుని. ఇంట్లో నుండి బయలు అమ్మ నేను ఆ ఇద్దరు ఆడవాళ్ళు.
టార్చి లైట్ తీసుకుంది. అది వెలగలేదు. ఎందుకు వెలగలేదో నాకు తెలుసు. ఒక్క నిమిషం లో వెలిగేటట్టు చేసేవాడిని. కానీ మౌనం గా ఉండి పోయాను.
ఊరి చివర ఉన్న పల్లె. లో ఒల్టెజ్ తో వెలుగుతున్న వీది దీపాలు.
రెండు మూడు గొందులు తిరిగి అక్కడికి చేరుకున్నాం.
పరిశుబ్రం గా ఉన్న ఒక ఇంటి ఆవరణలో చాప మీద ఒకావిడ ముసుగు వేసుకుని కూర్చుని ఉంది. సాయిబులు ప్రార్ధన చేసుకునేటప్పుడు కూర్చున్నట్లుగా కాళ్ళు మడుచుకుని ఉంది. చుట్టూ కొంత మంది సమూహం గా కూర్చుని ఉన్నారు.
మేము ఒక పక్కగా చాప మీద కూర్చున్నాము.
ఆమె ఎవరి ప్రశ్న కొ సమాదానం చెబుతుంది. మద్యలో ప్రభువు తో మాట్లాడుతుంది.
మాతో వచ్చిన వాళ్ళు కొబ్బరి నూనె సీసా ఆమె వద్దకి టేసుకువెళ్లి తక్కువ గొంతులో “రోశయ్య పంతులు బార్య వచ్చింది. కొడుకుమీద దొంగతనం అభియోగం వచ్చింది. వాక్కు కోసం వచ్చారు”
ఆమె మరి కొన్ని విషయాలు అడిగి తెలుసు కుంది.
నన్ను పిలిచింది.
నా ప్రాణం గజ్జల్లోకి వచ్చింది. పది అడుగులు మించని దూరం నడవటం నా వల్ల కాలేదు.
“అబ్బాయి .. మొన్న నే రాచవారి పాలెం నుండి ఒక అబ్బాయి ని తీసుకు వచ్చారు.
ఇంట్లో నుండి డబ్బు తీశాడు. అతన్ని అడిగానే . నేను తియ్యలేదు అని చెప్పాడు.
అబద్దం ఆడవద్దు అని హెచ్చరించాను. వినలేదు. బ్రతిమాలాను చెప్పలేదు. నీలాగే చిన్న పిల్లాడు. తెలిసీ తెలియని వయసు. నేను ప్రార్ధన చేశాను. ప్రభువుతో మాట్లాడాను. గడ్డి వాములో డబ్బు లు దాచి పెట్టాడని చెప్పాను. వాళ్ళు వెతికారు అక్కడే ఉన్నాయి. ఆ అబ్బాయికి రక్తపు విరోచనాలు అయ్యాయి. బలహీనమయి పోయాడు. నడవటం లేదు.” ఒక పాట పాడినట్లు చెప్పసాగింది.
అక్కడున్న వారందరూ ‘అల్లెలూయ” అంటూ వింత శబ్దం చేశారు.
మరో రెండు సంఘటనలు చెప్పాక ఆమె నన్ను ఊరడించింది.
“నీకేం భయం లేదు. నిన్ను సైతాను ఆవహించింది. అప్పుడు అదే నీచేత ఆ పని చేయించింది. చెప్పు ఎక్కడ దాచావు ఆ బల్బు” అంది.
అప్పటికే చొక్కా తడిచి పోయి ఉంది. “నాకేం తెలియదు.”
మరో రెండు మూడు సార్లు ఆమె ప్రయత్నం చేసి ఓడి పోయింది.
“ఇంతలో ఆమె కి దేవుడి పూనకం వచ్చింది. ప్రార్ధన లో అర్ధం కానీ, వాక్యాలు కానీ పదాలు గట్టిగా చెప్పింది.
“పిల్లవాడికి తప్పులేదు. సైతాను తప్పు. నాలుగు ఆదివారాలు చర్చి కి తీసుకు రండి. అపవాదు తొలగి పోతుంది”
ఇంకొంత నాటకీయ సన్నివేశాలు జరిగాక మేము తిరుగు ప్రయాణం అయ్యాము.
ఇప్పుడు నాకు కొంత దైర్యం గా అనిపించింది. జైలు నుండి వచ్చిన ఖైదీ ని మళ్ళీ ఇంట్లో కి రానిచ్చినట్లు.
భయం భయం గానే అమ్మ చెయ్యి పట్టుకున్నాను.
ఆ రాత్రీ నేను ఇంట్లో శ్రద్దగా చదువు నటిస్తూ ఉన్నప్పుడు.
నాన్న ఇంట్లోకి వచ్చారు.
“కొత్త బల్బు ఒకటి కొనిచ్చి వచ్చాను. రూపాయిన్నర అయింది.” అన్నాడు అమ్మతో.
స్నానం చేసి పట్టు పంచే కట్టుకుని ప్రతి రోజు లాగే పూజ కి కూర్చున్నాడు.
కనీసం అరగంట పైగా పూజ విధి ఉంటుంది.
అమ్మ పగలు కుట్టిన బట్టలు, గుడ్డి కరెంటు వెలుతురు లో చేతిపని, ఉక్సులు కుడుతుంది.
అక్క ట్యూషన్ నుండి వచ్చింది.
“నాన్న పూజ కాగానే అన్నం పెడతాను.” అంది అమ్మ.
నాన్న పూజ సగం మధ్యలో ఆపేశారు.
దుఖం తో ఆయన ఊగి పోతున్నాడు.
లేచి నా వద్దకి వచ్చాడు. “బాబూ .. నిన్ను చూస్తుంటే భయం గా ఉంది” అన్నాడు నా కళ్లలోకి చూస్తూ.
నేను నాన్నని విడుపించుకుని బయట పంచ లోకి నడిచాను.
చూరులో కాగితాలు చుట్టి దాచి పెట్టిన బల్బు తెచ్చి నాన్నకి ఇచ్చాను. ...
“నాన్నా తప్పు చేశాను.”

నల్లగా పొట్టిగా ఉన్న ఆయన కాళ్ళ ని వాటేసుకున్నాను. ..
ఆయన వంగి నన్ను లేపే ప్రయత్నం చేశాడు.
వీలవలేదు.
అక్కా, అమ్మా కూడా ప్రయత్నం చేశారు.
ఆయన కాళ్ళు వీడ లేదు.
కన్నీళ్ళతో ఆయన కాళ్ళు కడిగేశాను.

Thursday, 22 March 2018

విరామం

తేదీ 21_03_18 సాయంత్రం  16.43 కి మా కుటుంబాని కి ఒక అపురూపమయిన   కానుకని 
నిత్యం మేము కొలిచే "శ్రీ అభయ ఆంజనేయ స్వామి" ప్రసాదించాడు.

మా పెద్దమ్మాయి పాలడుగు భావనా స్రవంతి & రాజా లకి  కొడుకు పుట్టాడు.
నాకు తాత ప్రమోషన్ వచ్చింది.

మా 'మనుమడి' తో  చర్చించ వలసిన విషయాలు చాలా ఉండిపోయాయి.
కనుక బ్లాగ్ కి కొన్నాళ్లు విరామం.

Tuesday, 20 March 2018

దేవుడి పటం


ఊరికి దూరంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం లో ఉన్నదా ఇల్లు. వరండా తో కలిసి నాలుగు గదుల నిలువు ఇల్లు.
చుట్టూ ప్రహరి గోడ ఉన్న స్తలం లో గోడ వారగా కూరగాయల మొక్కలు, పూల మొక్కలు ఉన్నట్లు మసక వెలుగులో కనిపిస్తూ ఉంది. గేటు నుండి ఇంటి వరండా వరకు నాపరాళ్ళు పరిచి ఉన్నాయి. నాపరాళ్ళ మద్య మెత్తటి గడ్డి.
ఎక్కడయినా ఒక్క వీది లైటు వెలుగుతూ ఉంది. ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని ప్రాంతం. అప్పుడప్పుడూ వచ్చి పోయే సర్విస్ ఆటో లు తప్ప పెద్దగా జన సాంద్రత లేని ప్రాంతం.
ప్రశాంతమయిన వాతావరణం. ఎక్కడ ఏం జరిగినా అంత తొందరగా మిగిలిన వారికి తెలిసే అవకాశం లేని ప్రాంతం.
ఒక పాత మోటార్ సైకిల్ వచ్చి వీది మొదట్లో ఉన్న ఆ ఇంటి ముందు ఆగింది. గేటు తీసుకుని బండి లోపలి కి తెచ్చి పార్క్ చేసాడతను. బిడియం గా గేటు వద్ద నిలబడి చుట్టూ పరికిస్తున్న ఆమెని “వచ్చేయ్” అన్నాడు మెల్లిగా.
వరండా లైట్ వెయ్యకుండానే చీకట్లో తాళం తీసాడు.
ఇద్దరు లోపలి వెళ్ళాక తలుపు వేసాడతాను.
గదిలో ఎల్యీడి లైటు వెయ్యగానే కిటికీ పరదాలు సరిచేసాడు.
“కూర్చో “ చక్క సోఫా చూపిస్తూ ఆమెతో అన్నాడు.
“బట్టలకి బురద అంటింది “ అతన్ని గమనిస్తూ అంది.
మెయిన్ రోడ్డు మీద నుండి మలుపు తిరిగేటప్పుడు మంచి నీటి పైపు పగిలి అయిన మడుగులో వేగంగా ఎదో లారి వెళ్ళినప్పుడు చిమ్మిన బురద. వళ్ళంతా చింది ఉంది.
“నువ్వు కూడా తడిచి పోయావ్” అన్నాడు ఆమెని మళ్లీ గమనిస్తూ..
ముఖానికి పుసుకున్న పౌడర్ సరిగా అతకలేదు. కనకాంబరాలు, మల్లెలు కలిసిన పూలదండ వాడిపోటానికి సిద్దంగా ఉంది.
నడుం మీద ప్రౌడ వయసుతో వచ్చిన ముడత అందం గా ఉంది.
ఆతను ఆమె దగ్గరగా వచ్చి బుగ్గ లు నిమిరాడు. నడుం మడత మీద చెయ్యి వేసాడు.
శరీరం తయారుగా లేదు.
“బాత్ రూము ఎక్కడ?” అంది.
ఆతను పక్కకి జరిగి హల్లో నుండి వంట గది లో నుండి పెరడు లోకి నడుస్తూ ‘అక్కడ” అన్నాడు.
ఆమె అలవాటు అయిన చీకట్లో ఇంటికి పది అడుగుల దూరం లో ఉన్న బాత్రుం లోకి నడిచింది.
డోరు పక్కనే లైట్ స్విచ్ ఉంది.
బాత్ రూము శుబ్రంగా ఉంది ఒక ప్లాస్టిక్ పీపా లో నీళ్ళు నింపి ఉన్నాయి. రెండు మగ్గులు బోర్లించి ఉన్నాయి.
ఒక పక్క గోడకి ఉన్న చిన్న అరమారా లో బాత్రుం శుబ్రం చేసుకొనే లిక్విడ్స్ , సబ్బులు ఒక పేపర్ రోల్, ఒక వేస్ట్ బక్కెట్ ఒక ప్లాస్టిక్ సానిటరీ బ్రష్..
ఆమె తన చీర విప్పి తడిచిన బాగాన్ని నీళ్ళతో శుబ్రం చేసుకుంది. గట్టిగా పిండి మళ్లీ కట్టుకుంది. గోడకి ఉన్న చిన్న అద్దం లో ముఖం చూసుకుని బయటకి వచ్చింది.
లైట్ ఆర్పి ఆమె తిరిగి గదిలోకి వచ్చే సరికి ఆతను పొయ్యి మీద నీళ్ళు కాచుకుంటున్నాడు.
“అయిదు నిమిషాలు కూర్చో వచ్చేస్తాను” అంటూ వేడినీళ్ళు బక్కెట్లో పోసుకుని టవల్ తీసుకుని బాత్రుం కి వెళ్ళాడు.
ఆమె సోఫాలో కూర్చో బోతూ వాటిలో ఉన్న కుషన్ వైపు చూసింది. మాటి క్లాత్ మీద రెండు నెమళ్ళ బొమ్మలు రంగు రంగుల ఎంబ్రాయిడి దారం తో అల్లి ఉన్నాయి. అన్ని కుషన్ల మీదా అదే డిజైన్, అన్నీ చేత్తో కుట్టినవే...
ఆమె పక్కనే ఉన్న ప్లాస్టిక్ కుర్చీ లో కూర్చుంది.
గదిలో గోడ మీద ఒక పెద్ద ఫ్రేం కట్టిన బోర్డు ఉంది.
రంగు రంగుల గుండి లతో మాటి క్లాత్ మీద కుట్టిన మూడు అక్షరాల పేరు అది. “మాధవ్”
అర్మారా లో పోద్దిగ్గా సర్దిన బొమ్మలు, ఎక్కువ గా చేత్తో చేసినవే...
మద్య గది ఆనుకుని ఉన్న పడక గది. నవారు మంచం మీద మెత్తటి పరుపు. అలిగి పడుకోటానికి సరిపోనంత వెడల్పు. గోడ మీద ఒక కలర్ ఫోటో. అతను బార్య తొ కలిసి సముద్రం ఒడ్డున తడిచిన బట్టలతో అంటుకుని నిలబడ్డ ప్రైవేట్ ఫోటో. శుబ్రం గా ఉన్న గది. పొందికగా శ్రద్ధగా సర్ది ఉన్న గది. ఆమె గోడ మీది ఫోటో లో ఉన్న అతని బార్య ని తదేకంగా చూసింది. ఏంతొ కాలం తపస్సు చేసాక దొరికిన ‘ఫలాన్ని’ అందుకున్నట్లు... అతను అపురూపమయినట్లు
అందగత్తె... ఆ అందం శారీరకమైనదే కాదు. మరేదో తనకి అర్ధం కాని గంభీరమయిన అందం.

ఆమె ఆ గది దాటి ముందుకు వచ్చి కర్టెన్ తొలగించి వంట గదిలో కి చూసింది.
కొద్ది సామాను శ్రద్ధగా శుబ్రంగా ఉన్నాయి. ప్రతి వస్తువు ఎక్కడివక్కడ పొందికగా.. ఆవిడ చూస్తూ ఉండి పోయింది.
వంట గదిలో ఒక వైపు చిన్న దేవుడి గూడు. సీతా రాములు ఉన్న ఒకే ఒక్క ఫోటో, మట్టి ప్రమిదలు, నూనె ఉన్న సీసా అగరువత్తీలు, పూజా సామాగ్రి ..
***
ఆతను స్నానం చేసి లుంగీ కట్టుకుని బాత్రుం తలుపు వేసి ఇంట్లోకి వచ్చాడు.
ఆమె గది లో లేదు.
టీ షర్ట్ వేసుకుంటూ బయట వరండా లో చూసాడు. లేదు. బయట లైటు వేసి ఇంటి చుట్టూ చూసాడు. లేదు.
గేటు వద్దకి వెళ్లి రోడ్డు మీద చూసాడు. దూరంగా వెళ్తున్న అటో శబ్దం తప్ప అంతా ప్రశాంతం.
అతనికి భయం వేసింది. గబ గబా లోపలి వచ్చి చూసాడు. టేబుల్ మీద ఉంచిన వాలెట్ బద్రం గా ఉంది. డబ్బు దాదాపు సరిగ్గానే ఉంది ఒకటి రెండు నోట్లు తప్ప.
ఇంట్లో విలువయిన వస్తువులు అన్నీ చూసుకున్నాడు. బీరువా తాళాలు దానికే ఉన్నాయి. బీరువాలో బట్టలు, విలువయిన సామాను అన్నీ ఎక్కడివి అక్కడే ఉన్నాయి.
వంట గదిలో ను, హల్లో ను మరో సారి వెతికాడు.
దేవుడి గూటి ముందు కనకాంబరాల పూలదండ పడి ఉంది.
‘సీతా రాముల’ పటం వెనక్కి తిప్పి ఉంది.


Sunday, 11 March 2018

మనెమ్మ ఇక రాదు.

ఉదయం పూట .. అదీ వర్కింగ్ డే ఏ ఇల్లాలికయినా కురుక్షేత్రమే..
కాలింగ్ బెల్ మోగింది.
పొయ్యిమీద కుక్కర్ ఉంచి హల్లో కి వచ్చి తలుపు తీసింది మీనాక్షీ.
బయట ఒక అతను. ఆటో వాలా అని తెలుస్తుంది. ఖాకీ షర్ట్ వేసుకుని ఉన్నాడు.
“ఏమిటి?” అడిగింది విసుగ్గా.
“మీ పనావిడ మనెమ్మ మా ఆవిడ”
మీనాక్షీ కి కోపం నషాలానికి అంటింది.
మూడు రోజుల నుండి చెప్పా పెట్టకుండా పని లోకి రావటం మానేసింది. ఒక ఫోన్ లేదు పాడు లేదు. పొద్దుటే హౌస్ కీపింగ్ చేసుకుని పిల్లలని రెడీ చేసి, వండి లంచ్ బాక్స్ లు సర్ది పెట్టేసరికి పధ్మవ్యూహం కనిపిస్తుంది.
“ఎవయింది. మూడు రోజులుగా రావటం లేదు” గట్టిగా అడిగింది.
అతను ఒక్క నిమిషం తటపటాయించాడు.
“ఇక రాదు. వేరే చూసుకోండి. అది చెప్పటానికే వచ్చాను.”
“ఏం ? అడిగినంత జీతం ఇస్తున్నాగా? పండక్కి పబ్బానికి ఏదో ఒకటి కొనిస్తున్నాగా? రోజు ఇంట్లో మాతో పాటు టీ/ టిఫిన్లు అందుతున్నాయి గా? మరి ఇంకెందుకు మానటం” గయ్యిమంది మీనాక్షీ.
ఈ వాక్యం అంతా “ఏం రోగం” అనే అర్ధం వచ్చేలా చెప్పింది.
“అన్నీ బానే ఉన్నాయి. మీ నుండి కొన్నిచెడ్డ అలవాట్లు కూడా నేర్చుకుంటుంది. అందుకే నేనే వద్దన్నాను”
మీనాక్షీ ఆశ్చర్య పోయింది. తర్వాత ఆమెకి కోపం వచ్చింది. అవమానంగా అనిపించింది.
అతన్ని పరిశీలనగా చూస్తూ.. “ఏమిటట .. అంత చెడ్డ అలవాట్లు? తాగుడా? డ్రగ్సా? ” 'చెడ్డ' అనే పదాన్ని వత్తి వ్యంగ్యంగా అడిగింది.
“మీతో ఇవన్నీ మాట్లాడటం ఇష్టం లేదు. కానీ మీకు తెలియాలి కాబట్టి చెబుతాను”
అతన్ని నిశితం గా గమనిచ్చింది మీనాక్షి.
సన్నగా ఉన్న ఆరోగ్యం గా ఉన్నాడు. తల శుబ్రంగా దువ్వుకుని, ఉతికిన బట్టలు వేసుకుని నుదిటిన సిందూరం చుక్క పెట్టుకుని.... చూడాగానే ఒక సదభిప్రాయం కలిగేట్టు గా..
“తను బాగా మారిపోయింది. చెరో పని చేసుకునే వాళ్ళం. ఉన్నదాంట్లో బిందాస్ గా ఉండేవాళ్లం. మా అమ్మ మాతోనే ఉంటుంది. ఈ మద్య నన్ను చులకనగా మాట్లాడుతుంది. మరొకరితో పోలుస్తుంది. 'అత్త'ని పాత విషయాలు గుర్తుచేసి మరీ గొడవ పెడుతుంది. ఎందుకు పనికిరాని వాడినని ఏదేదో చేసి ఉండాల్సిందని ఫాల్తూ మాటలు మాట్లాడుతుంది. చంటి దాన్ని కొడుతుంది. నాకు బాధగా ఉంది. పోచమ్మ గుడికి తీసుకెళ్లి ప్రమాణం చేయించి అడిగాను. ఇందుకిలా అయ్యావు అని. చాలా సేపు మాట్లాడుకున్నాక దానికి కారణం ఇక్కడ పనిచేయటమే అని అర్ధం అయింది. మీరు ఇంట్లో మాట్లాడుకునే మాటలు, సార్ కి మీరు ఇచ్చే గౌరవం, ఇంటికి బందువులు వచ్చి వెళ్ళాక సార్ తో వాళ్ళ గురించి తక్కువగా చెప్పటం లాటివి బాగా వంట పట్టించుకుంది. గతం లో ఇలా లేదు మీ ఇంట్లో పని చెయ్యటం మొదలెట్టాకే ఇలా అయింది.”
మానాక్షి కి మైండ్ బ్లాక్ అయింది.
ఒక తక్కువ జాతి (స్థాయి) వాడు వేలెత్తి తన ప్రవర్తన ని చూపించి గేలి చెయ్యటం తట్టుకోలేక పోయింది.
ఆమెకి ఏం సమాదానం చెప్పాలో అర్ధం కాలేదు.
ఈ లోగా ఇంట్లో కుక్కర్ నాలుగోసారి విజిల్ వేసింది.
“అంబోతులా గా ఇంట్లో తిరక్క పోతే.. ఆ కుక్కర్ ఆపోచ్చుగా.?” హల్లో కి తొంగి చూసిన మొగుడిని కేక వేసింది.
నమస్కరించి వెనక్కి తిరిగి వెళ్తున్న అతను విన్నాడా? విని నవ్వాడా?
మీనాక్షి కి అర్ధం కాలేదు.

Sunday, 4 March 2018

మతిమరుపుకి మరో పేరు

తెలుసండీ తెలుసు.. గతం తో ఆమెని కొప్పడి తిట్టిన ప్రతిసారి తేదీలతో సహా చెప్పగలను.
హాస్పిటల్ బిల్ల్స్ అన్నీ ఫైల్ చేసే అలవాటు ఉంది. వాటిని చూస్తే సరిగ్గా చెప్పగలను.
అయితే మాత్రం మా ముసల్దానికి మతిమరుపు ఎక్కువవుతుంది. ఎప్పుడో రెండు గంటల క్రితం రోడ్డు పక్క దాబా హోటల్ లో తిన్నాం. అక్కడ మర్చిపోయిందట కళ్ళజోడు.
దాదాపు డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేశాక ఇప్పుడు తీరిగ్గా చెబుతుంది.
“కళ్ళజోడుజు బోజనం చేసిన చోట మరిచి పోయానని.”
ఖరీదయిన కళ్ళజోడు ప్లాటినం ఫ్రేం, బ్రాండెడ్ అద్దాలు పోయిన నెల లోనే దాదాపు ఒక నెల పెన్షన్ మొత్తం ఖర్చు చేసి కొనిచ్చాను.
ఆడాళ్ళకి మతిమరుపు ఎక్కువండీ. అప్పటికి చెబుతూనే ఉంటాను.
నా లాగే సుడోకు లు, వర్డ్ పజిల్స్ చేస్తూ ఉండు. బ్రైన్ షార్ప్ గా అవుతుంది.
మతిమరుపు అనేది దగ్గరకి రాదు. అని. వింటేనా?
ఏం చేస్తాం.. కారు వెనక్కి తిప్పాను.
మళ్ళీ రెండు గంటలు ప్రయాణం. దారిలో రెండు టోల్ గేట్లు..
తిరుగు ప్రయాణం మొత్తం తిడతూనే ఉన్నాను.
కిక్కరుమన లేదు. తప్పు వాళ్లదగ్గర ఉన్నప్పుడూ ‘కుయ్ కయ్’ మని అనరు.
ఇదే అవకాశం గా కడుపులో ఉన్న కసంతా తీర్చుకున్నాను.
“అసలు నిన్ను కాదే? మీ అమ్మా బాబుని అనాలి. ఒక్కటి ఒక్క పని వయినంగా చేసి చచ్ఛావా? నలబై ఏళ్ళు కాపరం చేశావు నలుగురిని కన్నావ్. అరడజను మంది మనమలు మనమరాళ్ళు , కాస్తన్నా బుర్ర పని చెయ్యొద్దా?
మళ్ళీ రెండు గంటలు వెనక్కి తోలుకొచ్చాక.
ఆ హోటల్ రాగానే కారు డోరు తీసుకుని గబాలున కిందకి దిగి లోపలికి పరుగు లాటి నడకతో వెళ్లే ఆవిడని కేకెవేసి చెప్పాను.
“అక్కడే నా టోపీ, SBI క్రెడిట్ కార్డు పెట్టాను. అవి కూడా పట్టుకురా?.”
ఏం చెబుతున్నాను?.. ఆ .. అసలు మతిమరుపుకి మరో పేరు ఆడది.